విశిష్ట పోషక ఔషధ గుణాలు
మహాతెలంగాణ న్యూస్, మహబూబాబాద్ బ్యూరో:
డిమాండ్ ఉన్న పంటల సాగు విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్న ఆగాకర (బోడకాకర) సాగుతో అధిక దిగుబడి – నికర ఆదాయం చిన్న, సన్నకారు రైతులకు గొప్ప వరం
ప్రస్తుత వాతావరణ మార్పులు, పరిస్థితులు, ఆరోగ్య సంరక్షణ, డెంగీ, కరోనా, పలు వైరస్ ల వలన కలిగే అనారోగ్య లక్షణాల నుండి సంరక్షణకు, రోగ నిరోధక శక్తి పెరగాలంటే అధిక పోషకాలు ఔషధ గుణాలు ఉన్న ఆగాకర (బోడకాకర) సాగు చాలా ముఖ్యం. వీటిని ఏక పంటగా, అంతర పంటగా, బోర్డర్ పంటగా, టెర్రస్ (మిద్దె) తోటలుగా మరియు ఇంటి అవరణంలో పెంచుకోవచ్చు. ఒకప్పుడు ఈ తీగ జాతి పంట అటవీ ప్రాతంలో సహజసిద్దంగా పండేవి, రానురాను ఈ పంటకు మార్కెట్ డిమాండ్ పెరిగింది. దీనివలన రైతులు ఈ పంటను చిన్న చిన్న కమతాల్లో సాగు చేసుకోవచ్చు.
లాభాలు :
బోడ కాకర సాగును అన్నీ పంటల కంటే ముందుగానే (మే నెలలోనే) ప్రారంభిస్తారు. 2 నెలలలోనే పంట చేతికొస్తుంది. 6 నెలల వరకు దిగుబడి ఉంటుంది.
సీజన్, డిమాండ్ ను బట్టి కిలో రూ.80 నుండి రూ.200 వరకు ఉంటుంది.
బోడ కాకరలో పోషకాలు , ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. ఇతర కూరగాయలతో పోలిస్తే బోడకాకర సాగు లాభదాయకం
ఒక ఎకరంలో 4 నుంచి 6 నెలల కాలం లో కనీసం రూ.4 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది.
విత్తనం ద్వారా:
ఇది సులువైన పద్ధతి. విత్తనం మొలక 10 – 15 శాతంగా ఉంటుంది. అందులో మరల ఆడ, మగ మొక్కులు వుంటాయి. ఆడ మొక్కలు 15 – 20 శాతం ఉంటాయి. ఎకరాకు 2X1 మీ. దూరంలో నాటుటకు 1000 ఆడ మొక్కలు అవసరం అవుతాయి. దీనికి 3000 మొక్కలు అనగా 9000 (మొలక 30% కనుక) గింజలు కావలసి వస్తాయి. ఈ విధంగా ఎకరాకు అరకుంచం విత్తనం అవసరమవుతుంది. పొలంలో 6×6 మీ. దూరంలో నాటిన స్తంభాల మధ్య 2×2 మీ. చొప్పున 16 మొక్కలు వస్తాయి. (అనగా 36 చ.మీ.లకు) ప్రతి 10 ఆడ మొక్కలకు 1 మగ మొక్కను విధిగా వుంచుకోవాలి. దాదాపు 1000 ఆడ మొక్కలకు 100 మగ మొక్కలు ఉండాలి.
నారుమడిని 4×1 మీ. సైజులో ఎత్తులో తయారుచేయాలి. 15 సెం.మీ. వరుసల మధ్య 10 సెం దూరంలో విత్తనాలు విత్తాలి. వీటిపై గడ్డి వేసి పెట్టాలి. 40-45 రోజులలో మొలకలు వస్తాయి.
మార్చి నెలాఖరులో నారుమడి వేస్తే, జూన్లో నాటుటకు తయారవుతాయి.
నాటుట:
దుంపలను గాని విత్తనం మొక్కలను 30X30×30 సెం.మీ. కొలతలు కలిగి పెంట ఎరువుతో నిండిన గుంతలలో నాటుకోవాలి. నేరుగా గుంతలలో విత్తనాలు నాటుకోవాలంటే ప్రతి గుంతకు 10-15 విత్తనాలు వేస్త 3-5 మొలకలు 40-45 రోజులలో వస్తాయి. అప్పుడు ఒక ఆడ తీగను వుంచి మిగతావి వేరే చోట నాటుకోవాలి.
పంట కాలం :
మే/జూన్ నుంచి అక్టోబర్/నవంబర్ వరకు ఉంటాయి. తర్వాత తీగ చనిపోతుంది. దుంప భూమిలో సుప్తావస్థలో ఉంటుంది. మళ్లీ మే/జూన్‌లో మొలకెత్తుతుంది.
అయితే జూన్ -అక్టోబర్ మధ్యలో ఎక్కువగా పూసే ఆడ మొక్కలను, తక్కువ ఎత్తులో పూసే మగ మొక్కలను ఎంచుకోవాలి.
సాధారణంగా ఆకులు ఒకే తమ్మెతో తీగలు ఎక్కువ దిగుబడి ఉంటుంది. 2.5 కిలోలు మొక్కకు ఇస్తుంది. అదే ఆకులు 3-5 తమ్మెలుగా ఉన్నటువంటి తీగలు తక్కువ దిగుబడి అంటే 1.0-1.5 కిలోలు మొక్క ఇస్తుంది. అదే విత్తనమైతే ప్రతి గుంతలో 10-15 విత్తనాలు వేయాలి.
అందులో నుంచి 3-5 పిలుకలు / మొక్కలు 40-45 రోజుల్లో వస్తాయి.
పందిరి: భూమికి 4-6 అడుగుల ఎత్తులో కొబ్బరి తాడు /జిఐ వైరులతో పందిరి ఏర్పరచుకోవాలి. తీగలను అంతటా పాకించాలి. లేదా ప్రతి మొక్క రెండు పాదలు ఏర్పాటు చేసుకొని తీగలను అల్లించవచ్చు.