రాజ్యాంగ హక్కుల్ని అపహాస్యం చేస్తున్న బిజెపి
సిపిఐ సెమినార్ లో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి
మహబూబాబాద్ :
దేశంలో నిరంతరం పేదల పక్షాన నిలబడి పోరాడి కమ్యూనిస్టుల ఐక్యత తక్షణ కర్తవ్యం అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబాబాద్ లోని లయన్స్ భవనంలో భారత దేశంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకత అనే అంశంపై బి విజయ సారథి అధ్యక్షతన జరిగిన సెమినార్లో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయి బలహీన పడడం వల్లనే దేశంలో మతోన్మాదులు పెరిగిపోయారని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తూ
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని మోడీ ప్రభుత్వం నియంతృత్వ , ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించిన విపక్షాలు, మేధావులు, కవులు, కళాకారులపై కక్ష గట్టి అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. పేదల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, ఎర్రజెండా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం సాధ్యమని ప్రజల పక్షాన నిలబడి పోరాడా కమ్యూనిస్టులు ఐక్యం కావాలని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
సిపిఐ జాతీయ శత వార్షికోత్సవ ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయండి
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శితో తక్కల్లపల్లి శ్రీనివాసరావు
ఈనెల 18న ఖమ్మంలో జరుగు సిపిఐ జాతీయ శతవాసికోత్సవాల ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కోరారు.చరిత్రలో నిలిచిపోయేలా సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ జనవరి 18న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. వందేళ్ల సిపిఐ సమర చరిత్రను నేటి తరానికి తెలియజేయడంతో పాటు సమకాలిన రాజకీయ పరిస్థితులు, మతోన్మాద ప్రమాదం, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు తదితర విషయాలను నేటి తరానికి తెలియజేసి భవిష్యత్తు పోరాటాలకు కార్యోన్ముఖులను చేసేందుకు ఈ సభ దోహదపడుతుందన్నారు.ఖమ్మం ఎస్ఆర్ ఆండ్ బీజిఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే ఈ సభకు అన్ని రాష్ట్రాల నుంచి సిపిఐ నాయకులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 19 నుంచి 21 వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మం సప్తపది ఫంక్షన్ హాల్లో జరుగుతాయన్నారు. 18న బహిరంగ సభ సందర్భంగా స్థానిక పెవిలియన్ మైదానం నుంచి 15వేల జనసేవాదళ్ కార్యకర్తలు కవాతు చేస్తారని, వీరితో పాటు కళాకారులు వృత్తి సంఘాలకు ప్రాతినిథ్యంవహిస్తూ ప్రజా సంఘాల కార్యకర్తలు ఆయా వృత్తుల వేషధారణలతో పాల్గొంటారని తెలిపారు.శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న జరిగే సభ జయప్రదం కోరుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.కరపత్రాలు, పోస్టర్లు,జీపుజాతాల ద్వారా ప్రచారం జరిగిందన్నారు.
20న జాతీయ స్థాయి సెమినార్
ఖమ్మంలో జనవరి 20న జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించడం జరుగుతుందని ఈ సెమినార్ కు అన్ని వామపక్షాల జాతీయ నాయకులు హాజరుకానున్నారని తెలిపారు.సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సిపిఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబి, వామపక్షాల నేతలు దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు. భారతదేశంలో వామపక్ష ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై జాతీయ స్థాయి సెమినార్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు బి అజయ్ సారధి రెడ్డి,నల్లు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు కట్టేబోయిన శ్రీనివాస్,పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్,చింతకుంట్ల వెంకన్న పాల్గొన్నారు.