వేముల మల్లేశం, భాదిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా వెంటనే అందించాలి
3 రోజుల్లో ముగ్గురు గౌడన్నల బ్రతుకుల్లో విషాదం బాధాకరం
మహాతెలంగాణ/మహబూబాబాద్ :
కేసముద్రం మండలంలో వరుసగా జరుగుతున్న గీత కార్మికుల ప్రమాదాలు గౌడ కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని గోపా డివిజన్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రతుకుదెరువు కోసం చేపట్టిన గౌడ వృత్తి నేడు బ్రతుకులనే బలి తీసుకుంటోందని అన్నారు. కుటుంబ పోషణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి తాటి చెట్లను నమ్ముకొని జీవనం సాగిస్తున్న గౌడన్నలు అదే తాటి చెట్ల కారణంగా ప్రాణాలు కోల్పోతుండటం అత్యంత బాధాకరమన్నారు.తమ భర్తలు పొద్దున వృత్తి రీత్యా బయటకు వెళ్లిన వాళ్ళు తిరిగి నవ్వుతూ ఇంటికి వచ్చే వరకు తాళి చేతిలో పట్టుకొని చూసే వాళ్ళ ఎదురుచూపులు మాటల్లో వర్ణించిలేనివని ఆవేదన వ్యక్తం చేసారు..
గత కొద్ది రోజుల వ్యవధిలోనే కేసముద్రం మండలంలో చోటుచేసుకున్న వరుస ప్రమాదాలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తున్నాయన్నారు. కేసముద్రం గ్రామానికి చెందిన ఉట్కూరి శ్రీనివాస్ గౌడ్ తాటిచెట్టుపై నుంచి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు మెదడులో రక్తం గడ్డకట్టిందని, చేతులు, కాళ్లు విరిగిపోయి ప్రస్తుతం హన్మకొండలోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అలాగే ఇంటికన్నె గ్రామానికి చెందిన సార రాజు తాటిచెట్టుపై నుంచి కిందపడటంతో వెన్నెముక, పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలపాలై మంచానికే పరిమితమై చికిత్స పొందుతున్నారని అన్నారు.
ఇక తాజాగా కల్వల గ్రామానికి చెందిన వేముల మల్లేశం తాటిచెట్టుపై నుంచి జారిపడి మృతి చెందడం గౌడ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న చిలువేరు సమ్మయ్య గౌడ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన ఆయన, పంచనామా ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబ పోషణ కోసం పనికి వెళ్లిన వ్యక్తి తిరిగి శవంగా ఇంటికి చేరడం హృదయ విదారకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్, మోడెం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మృతి చెందిన వేముల మల్లేశం కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వారి కుటుంబానికి తక్షణ సహాయం కింద ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 10 లక్షల ఎక్సగ్రేషియా ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కొరారు. అలాగే ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఉట్కూరి శ్రీనివాస్ గౌడ్ మరియు సార రాజులకు 5 లక్షల ఎక్సగ్రేషియా తోపాటు వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వం భరించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి గీత కార్మికుడికి నాణ్యమైన సేఫ్టీ బెల్టులు, భద్రతా పరికరాలు, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా అందించాలని డిమాండ్ చేశారు. తాటి చెట్లు ఎక్కే కార్మికులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. తాటి చెట్ల ఎత్తును తగ్గించే విధానాలతో పాటు ఆధునిక గీత పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. గౌడ్ కుటుంబాల భద్రత కోసం సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని చిలువేరు సమ్మిగౌడ్ స్పష్టం చేశారు.