వినాయక నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో, సమన్వయంతో విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్-జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్

మహాతెలంగాణ/మహబూబాబాద్:

జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తో కలిసి, వినాయక నిమజ్జన వేడుకలపై రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, పోలీస్ తదితర శాఖల ఉన్నతాధికారులతో నిమజ్జన ఏర్పాట్లపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించి, కీలక దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాల్లో, నిమజ్జన ఘాట్ల వద్ద పోలీస్ శాఖ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా రూట్ డైవర్షన్ ప్రణాళికలు అమలు చేయాలన్నారు.

విగ్రహాల ఊరేగింపు మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేత పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. నిమజ్జనం పూర్తయిన వెంటనే వ్యర్థాలను తొలగించేందుకు పారిశుధ్య కార్మికులను షిఫ్టుల వారీగా నియమించాలి.

ఊరేగింపు మార్గాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సంబందిత శాఖల వారు సరిచేసి, ఎత్తు పెంచాలన్నారు.విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్‌తో పాటు ఘాట్ల వద్ద అదనపు జనరేటర్లు, హైమాస్ట్ లైట్లను సిద్ధంగా ఉంచాలన్నారు. విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బంది కలగకుండా, క్రేన్లు సులభంగా నిలిచేందుకు మరియు విగ్రహాలు నీటిలో సరిగ్గా మునిగేందుకు నిమజ్జన పాయింట్ల వద్ద పూడిక తీత పనులు చేపట్టాలని అన్నారు.

ఇరిగేషన్ అధికారులు నిమజ్జనం జరిగే చెరువులు, జలాశయాలు లేదా కాలువల్లో తగినంత నీటి మట్టం ఉందో లేదో పర్యవేక్షించి మండల అధికారులను సమన్వయం చేసుకొని నివేదికలు అందజేయాలని అన్నారు.

ప్రమాదాలు జరగకుండా ఘాట్ల వద్ద బలమైన బారికేడింగ్, గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లతో కూడిన ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లను మోహరించాలన్నారు. అగ్నిమాపక శకటాలను (ఫైర్ ఇంజిన్లు) ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలన్నారు.

మండప నిర్వాహకులు, ప్రజలు అధికారులకు సహకరించి, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు అనుగుణంగా నిమజ్జనం పూర్తి చేయాలని అన్నారు.

మండల స్థాయిలో తహసీల్దార్లు పంచాయతీ కార్యదర్శులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి అవసరమైన ఏర్పాట్లపై కార్యాచరణ రూపొందించాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి వినాయక చవితి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.

నిమజ్జనం పూర్తయిన తరువాత ఘాట్ల వద్ద, ప్రధాన రహదారులపై మున్సిపల్ మరియు పంచాయతీ సిబ్బంది సహాయంతో మట్టి, వ్యర్థాలు, పూజా సామగ్రిని తొలగించి శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను నమోదు చేసి అనుమతి పొందాలని సూచించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేని వారు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమతులు పొందిన తర్వాతే మండపాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్, ఇంచార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పురుషోత్తం, డి.ఆర్.ఓ. నాగావాణి, డి.ఆర్.డి.ఓ మధుసూధనరాజు, మహబూబాబాద్, తొర్రూరు ఆర్దేఒ లు రాజేశ్వరీ, గణేష్ ట్రైనీ డిప్యుటీ కలెక్టర్ నితీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *