మహా తెలంగాణ/మరిపెడ:
మానవ అంతిమ సంస్కారాలు భాగంగా ఖననం(పూడ్చడం) చేసే ప్రజల కోసం ప్రత్యేక స్మశాన వాటిక ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరుతూ సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి.అబ్దుల్ రషీద్,ఏఐటీయూసీ,సిపిఐ నాయకులతో కలిసి సోమవారం మరిపెడ మండల పరిషత్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎం.డి. అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ,మరిపెడ మున్సిపాలిటీతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు ఉన్నప్పటికీ,తమ సంప్రదాయాల ప్రకారం కొన్ని కులాలలో ఖననం చేసే ప్రజలకు ప్రత్యేకంగా పూడ్చేందుకు తగిన స్థలం అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూమిని గుర్తించి,ఖననం చేసే ప్రజల కోసం అవసరమైన మేరకు ప్రత్యేక స్మశాన వాటికకు స్థలం కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు.అదేవిధంగా మరిపెడ మండలంలోని అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి,అవసరమైన మేరకు ఖననం చేసే ప్రజల కోసం ప్రత్యేక స్మశాన వాటికలకు భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి కుటుంబం తమ ఆత్మీయుల అంత్యక్రియలను గౌరవంగా నిర్వహించుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని,చివరి సంస్కారాలకు కూడా స్థలం లేక చెరువు కట్టల పక్కన రహదారుల వెంబడి ఖననం చేస్తూ ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎం.డి. అబ్దుల్ రషీద్ కోరారు.ఈ సమస్యపై తహసీల్దార్,ఎంపీడీవో,మున్సిపల్ అధికారులు,సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ భూములను పరిశీలించి,ఖననం చేసే ప్రజలకు ప్రత్యేక స్మశాన వాటికల కోసం భూమిని కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ,సిపిఐ నాయకులు ఈ. వీరేందర్,జి.వీరన్న,పి.నరేష్,పి.వెంకన్న,డి.నరసయ్య,తదితరులు పాల్గొన్నారు.