గంజాయి నిర్మూలనకి విలేకరులకు అవగాహన
గంజాయి రహిత మరిపెడ లక్ష్యంగా పోలీసుల ప్రత్యేక కార్యాచరణ
మహాతెలంగాణ/మరిపెడ
సమాజాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని మరిపెడ సీఐ ఎల్.పవన్ కుమార్ అన్నారు.శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాలతో మరిపెడ మండల పరిధిలో గంజాయి అక్రమ వ్యాపారం,వినియోగం పూర్తిగా నిర్మూలించి గంజాయి రహిత మరిపెడ లక్ష్యంగా కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు.ఎవరైనా గంజాయిని వినియోగించినట్లయితే నిర్ధారించేందుకు గంజాయి నిర్ధారణ యూరిన్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని వాటిని ప్రదర్శించారు.నేటి సమాజంలో కొందరు అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా అనేక అక్రమాలకు పాల్పడుతూ దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని,గంజాయిని చాక్లెట్లు,ఐస్ క్రీములు వంటి అనేక పదార్థాలలో కలుపుతూ చిన్నారుల నుండి యువకుల వరకు మత్తుకు బానిసలుగా చేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే విలేకరులు వారికి తెలిసిన అతి చిన్న సమాచారం అయినా తమ దృష్టికి తీసుకొని రావాలని,గంజాయి పూర్తిగా నిర్మూలించుటకు తమ వంతు బాధ్యతగా సమాచారాన్ని తమ దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే వాటి నిర్మూలన కు కృషి చేస్తామని,అదేవిధంగా గంజాయి అక్రమ వ్యాపారం వినియోగం చేసేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఎవరైనా గంజాయి మత్తుకు బానిసలుగా మారి వారు స్వచ్ఛందంగా తమని సంప్రదించిన,ఎవరైనా అనుమానితులు గంజాయి మత్తుకు బానిసలుగా మారారని తెలియపరిచిన వారిని గంజాయి టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షించి పాజిటివ్ అని తేలితే వారిని డి అడిక్షన్ సెంటర్లకు తరలించి అవసరమైన వైద్య సహాయం అందించి వారిని మత్తునుండి బయటపడే విధంగా పోలీసు శాఖ సహాయపడుతుందని అన్నారు.గంజాయి విక్రయం,రవాణా,నిల్వ,వినియోగానికి సంబంధించిన సమాచారం 87126 56999 టోల్ ఫ్రీ నంబర్‌కు అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని,ఉపయోగకరమైన సమాచారం అందించిన వారికి క్యాష్ రివార్డు అందజేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై గుండ్రాతి సతీష్,సెకండ్ ఎస్సై మెహబూబి,పోలీస్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.