రూ. 45 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబి అధికారులు
నర్సింహులపేట (మహబూబాబాద్ జిల్లా):
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో అవినీతి తిమింగలాలు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) వలకు చిక్కాయి. ఒక వెంచర్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసి, ఆ డబ్బులు తీసుకుంటుండగా ఎంపీడీవో, ఎంపీఓతో పాటు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన *ఎంపీడీవో కుమారుడిని* ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.*అసలేం జరిగిందంటే..?*నమ్మదగిన సమాచారం ప్రకారం.. నర్సింహులపేట మండల పరిధిలోని పడమటిగూడెం గ్రామంలో ఓ వెంచర్ ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల (Permission) కోసం బాధితుడు నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. అయితే, ఆ వెంచర్ అనుమతి మంజూరు చేయడానికి ఎంపీడీవో రాధిక, మండల పరిషత్ అధికారి (ఎంపీఓ) కిన్నెరా యాకయ్యలు సదరు బాధితుడిని లంచం డిమాండ్ చేశారు.చివరకు లక్ష రూపాయల భారీ మొత్తానికి డీల్ కుదిరింది. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ. 45,000 లంచం తీసుకునేందుకు అధికారులు ఒప్పందం చేసుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఈ విషయమై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించాడు.*పక్కా ప్లాన్‌తో పట్టుకున్న ఏసీబీ!*బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో నర్సింహులపేట ఎంపీడీవో కార్యాలయంపై దాడి చేశారు. బాధితుడి నుంచి ఎంపీడీవో రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్యల సమక్షంలో రూ. 45,000 నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి, వారిని రసాయన పరీక్షల (Chemical Tests) ద్వారా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.*ఆఫీసులో ఆధిపత్యం.. కుమారుడి అరెస్ట్!*ఈ అవినీతి భాగోతంలో ఎంపీడీవో రాధికా కుమారుడు నాగరాజు కీలక పాత్ర పోషించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఎంపీడీవో కార్యాలయంలో జరిగే అన్ని రకాల సెటిల్మెంట్లు, ఆర్థిక వ్యవహారాలను నాగరాజే వెనకుండి చక్కబెడుతుంటాడని సమాచారం. లంచం డబ్బుల వసూళ్లలో కూడా ఇతనే మధ్యవర్తిత్వం వహించడంతో ఏసీబీ అధికారులు నాగరాజును కూడా అదుపులోకి తీసుకున్నారు.*మీడియా అక్రిడిటేషన్ కార్డుతో హల్చల్!*ఈ కేసులో మరో ఆసక్తికరమైన మరియు షాకింగ్ విషయం ఏమిటంటే.. ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో కుమారుడు నాగరాజు వద్ద మీడియా అక్రిడిటేషన్ కార్డు ఉండటం గమనార్హం. ఓ వైపు జర్నలిస్టుగా చలామణి అవుతూనే, మరోవైపు తల్లి అధికార బలంతో ప్రభుత్వ కార్యాలయంలో చక్రం తిప్పుతూ ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం ఏసీబీ అధికారులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.