తెలంగాణ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకు జంగిలిగొండ ఎంపిక మహబూబాబాద్ జిల్లా నుంచి పైలట్ గ్రామ పంచాయతీగా ఎంపిక

హైదరాబాద్‌లో శిక్షణకు సర్పంచ్ గుండెల రేణుకకు ఆహ్వానం

తెలంగాణ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) అమలులో భాగంగా మహబూబాబాద్ మండలంలోని జంగిలిగొండ గ్రామ పంచాయతీ జిల్లా నుంచి పైలట్ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీఐఆర్‌డీ)లో శుక్రవారం నిర్వహించే శిక్షణ తరగతులకు జంగిలిగొండ గ్రామ సర్పంచ్ గుండెల రేణుకకు ఆహ్వానం అందింది. గ్రామాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నారు. గ్రామాల్లో కేవలం రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కల్పనకే పరిమితం కాకుండా ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, విద్య, పారిశుద్ధ్యం, పర్యావరణం, ఉపాధి, జీవనోపాధి, ప్రజా సంక్షేమం, మౌలిక వసతులు, సుపరిపాలన తదితర రంగాలను సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జీపీడీపీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలో అందుబాటులో ఉన్న వనరులు, ప్రజల అవసరాలు, సమస్యలు, అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టేందుకు ఈ ప్రణాళిక ఉపయోగపడుతుంది. గ్రామంలోని వనరులను సమర్థంగా వినియోగించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి చేరవేయడం, పారదర్శకమైన పాలన అందించడం వంటి అంశాలకు ప్రణాళికలో ప్రాధాన్యం ఉంటుంది.
సమగ్ర సమాచార సేకరణ
జంగిలిగొండ గ్రామానికి సంబంధించిన 2026–27 సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో భాగంగా గ్రామంలోని వివిధ అంశాలపై సమాచారాన్ని సేకరించి నమోదు చేశారు. ప్రధానంగా కుటుంబాల వివరాలు, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక భద్రతా పింఛన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమ పథకాలు, రవాణా సౌకర్యాలు, జీవనోపాధి, గ్రామంలో అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాలను ప్రణాళికలో పొందుపరిచారు. గ్రామంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సదుపాయాలతో పాటు ఇంకా అవసరమైన పనులను గుర్తించి, వాటికి ప్రాధాన్యత నిర్ణయించి దశలవారీగా అమలు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వివిధ శాఖల సమన్వయంతో గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు జీపీడీపీ మార్గదర్శకంగా ఉపయోగపడనుంది.
పారదర్శక పాలనతో అభివృద్ధి బాటలో నడిపిస్తాం:
సర్పంచ్ గుండెల రేణుక
ఈ సందర్భంగా జంగిలిగొండ గ్రామ సర్పంచ్ గుండెల రేణుక మాట్లాడుతూ, గ్రామ పంచాయతీని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు జీపీడీపీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. జంగిలిగొండ గ్రామానికి 2026–27 సంవత్సరానికి సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నాం. గ్రామంలోని ప్రతి కుటుంబానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, ఉపాధి, సంక్షేమం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తాం. ప్రజల భాగస్వామ్యంతో, పారదర్శక పాలనతో జంగిలిగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నిలిపేందుకు కృషి చేస్తాం. జిల్లా నుంచి పైలట్ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది” అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మురళి నాయక్, కలెక్టర్ స్నేహ శబరీష్ , డీపీవో రేవంత్, డీఆర్డీవో మధుసూదన రాజు, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు, గ్రామస్తులకు కృతజ్ఞాతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *