మహాతెలంగాణ/మహబూబాబాద్:
మహబూబాబాద్ పట్టణానికి చెందిన భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న వూరే గురునాథరావు భౌతిక శాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D.) పట్టా పొందారు. ద్రావిడియన్ యూనివర్సిటీ, కుప్పం భౌతిక శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థిగా కొనసాగిన ఆయన
“ఎ స్టడీ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ పాలీ (ఇథిలీన్ టెరెఫ్తాలేట్) విత్ నానో క్లే”(“A Study on Properties of Poly (Ethylene Terephthalate) with Nano Clay” ) అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. ఈ పరిశోధనను కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎస్. కాళహస్తి మార్గదర్శకత్వంలో నిర్వహించారు. పాలిథిలీన్ టెరెఫ్తాలేట్ (PET) పదార్థ లక్షణాలు, నానో క్లే ప్రభావం తదితర అంశాలపై ఆయన చేసిన పరిశోధన భౌతిక శాస్త్రం, పాలిమర్ సైన్స్ మరియు నానో మెటీరియల్స్ రంగాలకు ప్రాధాన్యతను కలిగి ఉంది. ప్రస్తుతం కేసముద్రం మండలం ZPHS పెనుగొండ పాఠశాలలో భౌతిక రసాయనశాస్త్ర ఉపాధ్యాయులుగా పని పనిచేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, పరిశోధన పట్ల ఆసక్తిని కొనసాగిస్తూ పీహెచ్‌డీ పట్టా సాధించడం పట్ల డా. వూరే గురునాథరావును పాఠశాల, ప్రధాన ఉపాధ్యాయులు కె.యాదగిరి, ఉపాధ్యాయులు , మిత్రులు మరియు శ్రేయోభిలాషులు అభినందించారు. ఈ సందర్భంగా డా. గురునాథరావు మాట్లాడుతూ, తన పరిశోధనా ప్రయాణంలో మార్గదర్శకత్వం అందించిన డా. ఎస్. కాళహస్తి, తనకు సహకరించిన అధ్యాపకులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, సహచరులు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఉపాధ్యాయ వృత్తితో పాటు పరిశోధన రంగంలోనూ రాణిస్తూ పీహెచ్‌డీ పట్టా సాధించడం ద్వారా డా. గురునాథరావు పలువురికి స్ఫూర్తిగా నిలిచారు.