రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి

ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 119 గ్రామపంచాయతీలు, 09 వార్డులలో నో హెల్మెట్ – నో ఎంట్రీ తీర్మానాలు

జిల్లా ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో “అరైవ్ అలైవ్ (Arrive Alive)” కార్యక్రమం మరియు రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులకు రహదారి భద్రత, గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు గ్రామ పంచాయతీ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, హెల్మెట్ ధరించకపోవడం వల్లే అధిక శాతం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం సంభవిస్తోందని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

గ్రామ పంచాయతీలు అమలు చేస్తున్న “నో హెల్మెట్ – నో ఎంట్రీ” నిర్ణయం అభినందనీయమని, ఈ నిర్ణయం తీసుకున్న గ్రామాల సర్పంచులను ప్రత్యేకంగా అభినందించారు.

అదేవిధంగా “మన ఊరు – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ రోజు నిర్వహించిన గ్రామసభల్లో ఒక్కరోజే 119 గ్రామపంచాయతీలు, 09 వార్డులలో సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, పాలకవర్గ సభ్యులు మరియు గ్రామస్తులు కలిసి ప్రత్యేక తీర్మానాలు ఆమోదించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

“నో హెల్మెట్ – నో ఎంట్రీ” విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తామని, ట్రాఫిక్ నియమాలను విధిగా పాటిస్తామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ గ్రామాలను మరింత సురక్షితంగా తీర్చిదిద్దుకుంటామని, గంజాయి అనే మహమ్మారిని తమ గ్రామాల్లోకి రానివ్వబోమని గ్రామ సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, పాలకవర్గ సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించడం సంతోషకరమని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ మహత్తర కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, పాలకవర్గ సభ్యులు, పోలీసు సిబ్బంది మరియు వివిధ శాఖల అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

గంజాయి నిర్మూలన కోసం జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఎస్పీ గారు, గంజాయి విక్రయాలు లేదా సరఫరా గురించి 8712656999 నంబర్‌కు పక్కా సమాచారం అందించిన వారికి రూ.5,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు.

అలాగే మైనర్లు వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణించడం, వాహన నంబర్ ప్లేట్లలో మార్పులు చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ట్రాక్టర్ల వెనుక భాగంలో ఎరుపు రంగు రిఫ్లెక్టర్ స్టిక్కర్లు ఏర్పాటు చేసుకోవాలని, వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ గ్రామసభలో రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్, గూడూరు సి.ఐ విజయ్, ఎస్.ఐ గిరిధర్, ఎం.ఆర్.ఓ నాగభవాని, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్ సునీత, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *