జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి
మహాతెలంగాణ/ మహబూబాబాద్ :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (వైఐఐఓఈ ) లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణమూర్తి, జిఇసిఓ వై.గాయత్రి సంయుక్త ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యార్థినుల విద్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలను ప్రారంభించిందని తెలిపారు. ఈ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాల విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు, కంప్యూటర్ విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, కోడింగ్ తదితర ఆధునిక విద్యా అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. మహబూబాబాద్ కేజీబీవీలో నీట్, బయ్యారం కేజీబీవీలో ఐఐటీ,జెఈఈ, గూడూరు కేజీబీవీలో క్లాట్ కోర్స్ ల్లో ప్రస్తుతం ఈ ప్రవేశాలు 3 కేజీబీవీల్లో నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఒక్కో కేజీబీవీ లో 40 సీట్ల చొప్పున ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష జూలై 12వ తేదీ ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించబడుతుందని, జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలయం లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థినులను మాత్రమే ఈ ప్రవేశపరీక్షకు అర్హులని వారు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి అర్హత కలిగిన బాలిక సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణమూర్తి, జీఈసీఓ వై.గాయత్రి కోరారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సమీప కేజీబీవీ ఎస్ ఓ లను లేదా జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం (జిల్లా విద్యాశాఖాధికారి)లో సంప్రదించాలని తెలిపారు.