జిఇసిఒ వై గాయత్రి
మహా తెలంగాణ/ మహబూబాబాద్
విద్యార్థినిలు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని జిఈసీఓ వై గాయత్రి అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ )ను జిల్లా జి ఈ సి ఓ వై. గాయత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల విద్యా ప్రమాణాలు, పాఠశాల నిర్వహణ, భోజన నాణ్యత, ఆరోగ్య పరిరక్షణ, మౌలిక వసతులు, అకాడమిక్ కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించారు.
పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వసతి గృహం, వంటశాల, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. వంట సిబ్బందితో మాట్లాడి ఆహార తయారీ, పరిశుభ్రత, ఎస్ ఓ పి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు . విద్యార్థినులకు నాణ్యమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు .
తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించారు. ముఖ్యంగా విద్యార్థినులతో ఎక్కువగా ఆంగ్ల భాషలోనే సంభాషించే వాతావరణాన్ని కల్పించాలని, ప్రతి విద్యార్థిని ఆంగ్లంలో మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. 6వ తరగతిలో నిర్వహిస్తున్న “చెలిమి” కార్యక్రమాన్ని పరిశీలించి, విద్యార్థుల చురుకుదనాన్ని అభినందించారు. అనంతరం సోహం అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ కార్యక్రమాన్ని పర్యవేక్షించి విద్యార్థినులు సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే ఆర్ బి ఎస్ కె వైద్య బృందం నిర్వహించిన మెడికల్ క్యాంపును పరిశీలించి, విద్యార్థినుల ఆరోగ్య పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిఈసీఓ మాట్లాడుతూ, కస్తూర్బా విద్యాలయాల్లో విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం, ఆరోగ్య సేవలు, సురక్షిత వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి విద్యార్థిని సమగ్ర అభివృద్ధి చెందేలా ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ భవాని, పీజీసీఆర్టీ లు, సీ ఆర్ టీ లు, నాన్-టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.