మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థి సంఘాల విద్యాసంస్థల బంద్ విజయవంతం
మహా తెలంగాణ/మహబూబాబాద్ :
రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా, నేడు మహబూబాబాద్ జిల్లాలో AISF, SFI, మరియు PDSU విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ అత్యంత విజయవంతంగా కొనసాగింది. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మరియు విద్యార్థుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఈ ఆందోళన చేపట్టాయి.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన విద్యాసంస్థల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు బంద్ నిర్వహించి, విద్యాసంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు వెలుగు శ్రవణ్ AISF జిల్లా కార్యదర్శి, పట్ల మధు SFI జిల్లా కార్యదర్శి, భోనగిరి మధు PDSU జిల్లా కార్యదర్శులు మాట్లాడుతూ, “ప్రభుత్వం విద్యార్థుల పట్ల మొండి వైఖరి వీడాలి. సమస్యల పరిష్కారం కోసం పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోకపోవడంతోనే ఈ బంద్కు పిలుపునిచ్చాం.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందాల్సిన బకాయి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. స్కాలర్షిప్ల జాప్యం వల్ల వేలాది మంది విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాల కల్పన, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ మరియు అధ్యాపక పోస్టుల భర్తీ చేపట్టాలి. ప్రైవేట్ విద్యాసంస్థలలో జరుగుతున్న దోపిడీని అరికట్టి, ఫీజుల విషయంలో ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. విద్యా రంగానికి కేటాయించే బడ్జెట్ను పెంచి, విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలి. ప్రభుత్వ విద్యా సంస్థ ముసివేతను విరమిచ్చుకోవాలి అని డిమాండ్ చేసారు.
తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని హెచ్చరించారు.
ఈ బంద్ కార్యక్రమంలో AISF, SFI, మరియు PDSU జిల్లా నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా విద్యార్థి సంఘాల ఆందోళనకు మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా తరగతులను నిలిపివేశాయి.