*గిరిజన ప్రాంతాల్లో పోలీస్ నియామకాల్లో 75% రిజర్వేషన్ అమలు చేయాలి*
సీఎం రేవంత్ రెడ్డిని కోరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తదితర గిరిజన ఎమ్మెల్యేలు*
మహాతెలంగాణ /హైదరాబాద్:
గిరిజన ప్రాంతాల్లోని స్థానిక యువతకు పోలీస్ ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించేందుకు 75 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో కలిసి గౌరవ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు, సహచర గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న స్థానిక యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. గిరిజన ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, సామాజిక–ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని స్థానిక యువతకు ప్రత్యేక అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.“గిరిజన ప్రాంతాల్లో పోలీస్ ఉద్యోగం అంటే కేవలం ఒక ఉద్యోగం కాదు.. స్థానిక యువతకు భవిష్యత్తుకు భరోసా, వారి కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం, గిరిజన సమాజానికి ఆత్మవిశ్వాసం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడం ద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు, పోలీస్ శాఖలో స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న యువతకు అవకాశం కల్పించినట్లవుతుందని అన్నారు. స్థానిక యువత పోలీస్ వ్యవస్థలో భాగస్వాములైతే ప్రజలకు పోలీసులకు మధ్య మరింత విశ్వాసపూర్వక సంబంధాలు ఏర్పడతాయని తెలిపారు.గతంలో గిరిజన ప్రాంతాల యువతకు ఎదురైన ఉద్యోగ అవకాశాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని, 75 శాతం రిజర్వేషన్ అమలుకు అవసరమైన రాజ్యాంగ, చట్టపరమైన అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరినట్లు తెలిపారు.గిరిజనుల హక్కులు, సంక్షేమం, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గిరిజన యువతకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరిజన యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించడం కోసం అవసరమైన ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు తెలిపారు.