మహా తెలంగాణ / మహబూబాబాద్ :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “అన్నా-అక్క మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ – AI & డిజిటల్ లెర్నింగ్” లో భాగంగా నూకల రామచంద్రరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి), మహబూబాబాద్‌కు చెందిన విద్యార్థులు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై “సర్టిఫైడ్ స్టూడెంట్ ట్రైనర్స్” గా అర్హత సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. లక్ష్మణ్ నాయక్ విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు.
తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (Artificial Intelligence), డిజిటల్ లెర్నింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై సమగ్ర శిక్షణ అందించబడింది. శిక్షణ అనంతరం నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు మరియు ఇతర ప్రభుత్వ విద్యాసంస్థల్లో స్టూడెంట్ ఇంటర్న్‌లు/మెంటర్లుగా సేవలందించేందుకు అర్హత పొందారు.
నేటి నుండి ఈ సర్టిఫైడ్ విద్యార్థులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల విద్యార్థులకు AI, డిజిటల్ లిటరసీ, కంప్యూటేషనల్ థింకింగ్, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో డిజిటల్ అవగాహన పెంపొందించడంతో పాటు భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రిన్సిపాల్ తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమంలో తమ కళాశాల విద్యార్థులు సర్టిఫైడ్ ట్రైనర్లుగా ఎంపిక కావడం గర్వకారణమని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన AI విద్యను అందించడంలో వీరు విశిష్ట సేవలు అందిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా సర్టిఫైడ్ ట్రైనర్లుగా ఎంపికైన విద్యార్థులకు అధ్యాపకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతలపై నాణ్యమైన శిక్షణ అందించి తెలంగాణ ప్రభుత్వ “అన్నా-అక్క మెంటర్‌షిప్ ప్రోగ్రామ్” విజయవంతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, నోడల్ ఆఫీసర్లు అయినటువంటి ఎం సుమన్ వి సాంబశివరావు ఎస్ కే కాసింషా మరియు ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ జూపూడిఅనిల్ కుమార్ పాల్గొనడం జరిగింది