పంట సాగులో వర్షపాతం, విత్తనాల లభ్యత ప్రధానాంశం

ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

పంట సాగులో వర్షపాతం, విత్తనాల లభ్యత ప్రధాన అంశాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వాతావరణ మార్పులు, వ్యవసాయ సాగు, విద్యారంగ అభివృద్ధి, త్రాగునీరు ఇతర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో వానాకాలం–2026లో ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదు అయిన నేపథ్యంలో వ్యవసాయ సాగులో ప్రయోజనకర పద్ధతులను, పంట మార్పిడి విధానాలను రైతులకు వివరించి లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వానాకాలం సాగుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, జిల్లాల వారీగా విత్తనాల నిల్వలు, పంపిణీపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. వానాకాలం–2026లో 138.49 లక్షల ఎకరాలలో పంటల సాగు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఇందుకు అవసరమైన 19.68 లక్షల క్వింటాళ్ల విత్తనాల అవసరానికి గాను 74.44 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులకు ఎటువంటి కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఈ ఏడాది 530.43 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని, సుమారు 3.98 కోట్ల రూపాయల విలువైన విత్తనాలను సీజ్ చేసి 73 మందిని అరెస్టు చేసి, 39 క్రిమినల్ కేసులు, 2 పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా స్థాయి ప్రత్యేక తనిఖీ బృందాలు విత్తన విక్రయ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, అనుమానాస్పద ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని, పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని ఆదేశించారు. 5 జిల్లాలలో సాధారణ, 27 జిల్లాలలో లోటు, ఒక జిల్లాలో తీవ్ర లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. మండలాల వారీగా 36 మండలాలలో అధిక, 142 మండలాల్లో సాధారణ, 358 మండలాలలో లోటు, 85 మండలాలలో తీవ్ర లోటు వర్షపాతం నమోదైందని వివరించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

విద్యార్థుల నమోదు లక్ష్యాలు వేగవంతం*

ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల నమోదు వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు పాఠశాలల వారీగా నమోదు పురోగతిని ప్రతిరోజూ సమీక్షిస్తూ, లక్ష్య సాధనకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. ప్రీ-ప్రైమరీ విభాగాల ఏర్పాటు, బోధకులు/సిబ్బంది నియామకం, టీచింగ్–లెర్నింగ్ మెటీరియల్, ఫర్నిచర్‌తో పాటు అవసరమైన ఇతర సామగ్రి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, నియామకాలు, కొనుగోళ్లు పెండింగ్‌లో ఉన్న జిల్లాలు వాటిని తక్షణమే పూర్తి చేయాలని తెలిపారు. ప్రీ-ప్రైమరీ విభాగాలకు సంబంధించిన యూడైస్వి వరాలను పూర్తిగా నవీకరించి, విద్యార్థుల ప్రవేశాల సమాచారాన్ని సకాలంలో నమోదు చేయాలని సూచించారు. యూడైస్‌లో నమోదు కాని ప్రవేశాలను వెంటనే అప్‌డేట్ చేసి, వాస్తవ గణాంకాలు ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల ప్రవేశాలను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో కూడా నిర్దేశించిన ప్రవేశ లక్ష్యాలను పూర్తి చేసి, ఖాళీ సీట్లను త్వరితగతిన భర్తీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించే దిశగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, ప్రతి పాఠశాల స్థాయిలో విద్యార్థుల నమోదును పర్యవేక్షించి, లక్ష్య సాధనకు అవసరమైన చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, నిర్దేశిత గడువులో పూర్తి అయ్యేలా పనుల వేగాన్ని మరింత పెంచాలని తెలిపారు. కేంద్రీకృత వంటశాలలు అన్నింటినీ సెప్టెంబర్ 30వ తేదీలోపు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని, తద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి*

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని 33 జిల్లాలలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, జిల్లా, డివిజన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. సున్నిత ప్రాంతాలలో జ్వరాలపై ప్రత్యేక నిఘా చేపట్టి, ప్రతిరోజూ నివేదికలు పంపాలని, ప్రతి శుక్రవారం “డ్రై డే” కార్యక్రమం నిర్వహిస్తూ దోమల నివారణ చర్యలు, లార్వా నిర్మూలన, ఫాగింగ్, నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో శుభ్రత కార్యక్రమాలను ముమ్మరం చేయాలని తెలిపారు.

ప్రజారోగ్య పరిరక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్య, ఐసీడీఎస్, గిరిజన సంక్షేమ, రెవెన్యూ శాఖలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, త్రాగునీటి నాణ్యత, పాఠశాలలు, వసతి గృహాల పరిశుభ్రత, ప్రజలలో అవగాహన కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో కోతుల సమస్యలను పరిష్కరించడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మంకీ ఫుడ్ కోర్ట్ లో ఏర్పాటు, పంటల సంరక్షణ ఏబీసీ సెంటర్ల ఏర్పాటు పశువైద్య శాఖ ద్వారా చర్యలు తీసుకోవడం కోసం తగు సూచనలు జారీ చేయవలసిందిగా కోరారు,ఈ కార్యక్రమంలో ఇంచార్జీ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పురుషోత్తం, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, ఉద్యానవన శాఖ అధికారి జి.మరియన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, జిల్లా పంచాయతీ అధికారి హరి ప్రసాద్, ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, జనరల్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈ.ఈ., సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *