ట్రైబల్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ కార్యాలయాల్లో అధికారులతో సుదీర్ఘ సమావేశాలు
కేంద్ర నిధుల సాధన, కొత్త ప్రతిపాదనలు, పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధియే లక్ష్యంగా ఎంపీ శ్రీ పోరిక బలరాం నాయక్ హైదరాబాద్లో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం నుండి నియోజకవర్గానికి రావాల్సిన వివిధ నిధులు మరియు అభివృద్ధి పనుల సాధనకై ఆయన ముమ్మరంగా శ్రమించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సమీక్ష: తొలిత హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ శాఖ (ట్రైబల్ వెల్ఫేర్) ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎమ్. బాలు గారితో ఎంపీ గారు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కేంద్రం నుండి రావలసిన నిధులపై కూలంకషంగా చర్చించారు. నియోజకవర్గంలో తక్షణమే కేంద్రానికి పంపాల్సిన కొత్త ప్రతిపాదనలు, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న వివిధ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ ఎస్ఈ ఫణి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ కార్యాలయంలో సమావేశం
అనంతరం హైదరాబాద్లోని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ (ENC) కార్యాలయానికి వెళ్లిన ఎంపీ బలరాం నాయక్ గారు, అక్కడ పబ్లిక్ హెల్త్ ఉన్నతాధికారులతో మరో సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన పట్టణాభివృద్ధి పనులు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునికీకరణ మరియు అమృత్ పథకాల నిధుల గురించి,కేంద్ర ప్రభుత్వం నుండి మున్సిపాలిటీలకు రావలసిన పలు నిధుల విడుదలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.నిధుల సాధనలో ఎటువంటి ఆలస్యం జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుండి రావలసిన ప్రతి పైసాను రాబట్టి, నియోజకవర్గంలోని గిరిజన తండాలు మరియు పట్టణ ప్రాంతాలను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ శ్రీ పోరిక బలరాం నాయక్ గారు స్పష్టం చేశారు.