మహా తెలంగాణ/తాడ్వాయి:
తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ వనదేవతలను సోమవారం మంత్రి దనసరి అనసూయ సీతక్క దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి అనసూయ సీతక్క, ఆలయ పీటీ బీమ్స్, క్యూ లైన్లు, మీడియా టవర్లు, గ్రానైట్ పనులతో పాటు ఆలయ ప్రాంగణం వెనుక భాగంలో ఏర్పాటు చేయనున్న నూతన క్యూ లైన్ ఏర్పాటుకు అవసరమైన అంశాలను పరిశీలించారు. ఈవో కార్యాలయ పరిసరాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, డీపీఓ వెంకయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆలయ ఈవో, సంబంధిత జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.