మహా తెలంగాణ/మరిపెడ:
స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే చోట వారి సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగిందని మరిపెడ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి అన్నారు.సోమవారం మరిపెడ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణిని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రతి సోమవారం 23 శాఖల అధికారులు ఉదయం పదిగంటల నుండి ఒంటిగంట వరకు మరిపెడ మండల పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని,ప్రజలు ఎవరైనా వారి సమస్యలపై నేరుగా అధికారులను కలిసి మాట్లాడి ఫిర్యాదు చేయవచ్చని,వారి అర్జీలను అధికారులు స్వీకరించి వెంటనే ఆన్లైన్ చేసి ప్రజావాణి పోర్టల్ లో నమోదు చేసి ఐడి రసీదును ఇస్తారని,ఫిర్యాదుదారుల మొబైల్ నెంబర్ కి మెసేజ్ తోపాటుగా,వాట్సాప్ సమాచారం ఇస్తారని,అత్యవసర సమస్యలను తక్షణమే అధికారులు పరిష్కరించడానికి కృషి చేస్తారని,ఇతర సమస్యలను 30 రోజుల లోపల పరిష్కరిస్తారని అన్నారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో 23 ఫిర్యాదులు రాగా అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖకు,అత్యల్పంగా విద్యుత్ శాఖకు ఫిర్యాదులు వచ్చాయి.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణవేణి,కమిషనర్ నరేష్ రెడ్డి,వైద్యాధికారి రవి,మండలంలోని వివిధ శాఖల అధికారులు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.