మహాతెలంగాణ/మరిపెడ:
ఆల్కహాల్,గంజాయి,మత్తు పదార్థాలపై కఠిన నియంత్రణ అవసరం అని సిపిఐ మహబూబాబాద్ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ అన్నారు.శుక్రవారం మరిపెడలో ఆయన మాట్లాడుతూ,నల్గొండ జిల్లాలో ప్రిన్సిపాల్ రూపా రెడ్డిపై టెన్త్ క్లాస్ విద్యార్థులు దాడి చేసి హత్య చేసిన ఘటనను సీపీఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ అన్నారు.విద్యార్థులు చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులో ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడటం అత్యంత ఆందోళనకరమైన విషయమన్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి,బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం సమాజంలో ఆల్కహాల్,గంజాయి, మత్తు పదార్థాల వినియోగం యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్న అంశంగా మారిందని అన్నారు.చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు పరిచయం కావడం వల్ల విద్యార్థుల్లో ఆలోచనా విధానం,ప్రవర్తన,చదువు,కుటుంబ సంబంధాలు దెబ్బతినడంతో పాటు హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉందన్నారు.గంజాయి,ఇతర మాదక పదార్థాలు విద్యార్థులకు అందకుండా పాఠశాలలు,కళాశాలలు వాటి పరిసర ప్రాంతాల్లో కఠిన నిఘా ఏర్పాటు చేయాలని కోరారు.మత్తు పదార్థాలను విక్రయించే వ్యక్తులు,అక్రమంగా సరఫరా చేసే నెట్వర్క్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా మద్యం,గంజాయి ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలని,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,విద్యాశాఖ,పోలీసు శాఖ సమన్వయంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు,పెన్నులు ఉండాల్సిన వయసులో మత్తు పదార్థాలు,హింస ప్రవేశించకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.యువత భవిష్యత్తును కాపాడటం ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ప్రిన్సిపాల్ రూపారెడ్డి కుటుంబానికి సీపీఐ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు.