తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫిజికల్ లిటరసీ కార్యక్రమంపై అవగాహన

మహాతెలంగాణ/మహబూబాబాద్

తెలంగాణ ప్రభుత్వం మరియు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) సంయుక్తంగా జిల్లాల స్థాయిలో ఫిజికల్ లిటరసీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలపై ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఇందులో భాగంగా శనివారం మహబూబాబాద్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫిజికల్ లిటరసీ కార్యక్రమం అమలుపై జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి డాక్టర్ ఓలేటి జ్యోతి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి డా. ఓలేటి జ్యోతి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు శారీరక వ్యాయామం, క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. చిన్న వయస్సు నుంచే శారీరక కార్యకలాపాలను అలవర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతాయని తెలిపారు.

ఫిజికల్ లిటరసీ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వివిధ శారీరక వ్యాయామాలు, క్రీడలు, శారీరక దారుఢ్యానికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు జ్యోతి వివరించారు. విద్యార్థులు కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించి, అందులోని వివిధ అంశాలను తెలుసుకున్నారని అన్నారు.

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించి, వారిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు చొరవ చూపాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాస్ రావు, పీడీ నసీరుద్దీన్, సిబ్బంది మహేష్, రామన్న, సాజిద్, నరేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *