ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
మహాతెలంగాణ/మహబూబాబాద్:
ఉపాధ్యాయుల ప్రయోజనాలే పిఆర్టియుటిఎస్ ప్రధాన లక్ష్యమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు.మహబూబాబాద్ జిల్లా పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం ఇక్కడ జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రాథమిక సభ్యుల మనోబలమే సంఘానికి అసలైన బలమని అన్నారు.ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న ప్రతి పాఠశాలలో, ముఖ్యంగా గురుకులాల్లో పిఆర్టియుటిఎస్ ప్రాతినిధ్యం ఉండాలని, గురుకుల ఉపాధ్యాయుల నుంచి సభ్యత్వాన్ని పెంచుకోవాలని సూచించారు.గురుకులాల పని సమయాల్లో మార్పు, ఇహెస్ఎస్ సౌకర్యం సాధించడంలో పిఆర్టియుటిఎస్ కృషి చేసిందని, అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యల పరిష్కారం కోసం సంఘం పనిచేస్తుందని తెలిపారు.ఎస్జిటీ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేలా చట్టసవరణ కోసం తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. అసాధ్యమనుకున్న అంశాలను సుసాధ్యం చేసిన ఘనత పిఆర్టియుటిఎఎస్ దేనని, పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు తీసుకురావడంలో సంఘం కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు.రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న హెల్త్ స్కీమ్‌ను సాధించుకున్నామని, ఈ నెలలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చించి సీపీఎస్ రద్దు, నూతన పిఆర్సి ప్రకటన సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు.2003 డిఎస్సి ఉపాధ్యాయుల ఒపిఎస్ సమస్యకు సెప్టెంబర్ 1లోపు పరిష్కార మార్గం వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.ఏకీకృత సర్వీస్ రూల్స్ తీసుకురావడానికి👌 కృషి చేస్తున్నానని, తద్వారా అర్హులైన ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు లభించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పిఆర్టియుటిఎస్అనేక ఉత్తర్వులు సాధించిందని, 29 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాల సమస్యను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.010 కింద జీతాలతో సహా అనేక ప్రయోజనాలను పిఆర్టియుటిఎస్ సాధించిందని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు త్వరలో పదోన్నతులు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.టెట్ ను సంవత్సరానికి రెండు సార్లు, అదనంగా రెండు ఇన్ సర్వీస్ టెట్ లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని, అవసరమైతే మాన్యువల్ విధానంలోనైనా టెట్ నిర్వహించి అందరూ అర్హత సాధించే వరకు అవకాశాలు కల్పించేలా కృషి చేస్తానని ప్రకటించారు. సెప్టెంబర్ 1న పెద్ద ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడతామని, అవసరమైతే అసెంబ్లీ ముట్టడి, ఆమరణ నిరాహార దీక్ష వంటి ప్రజాస్వామ్య పోరాట కార్యక్రమాలకు కూడా సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎప్పటికీ ఉపాధ్యాయుల పక్షాన పనిచేస్తానని స్పష్టం చేశారు. పిఆర్టియుటిఎస్ కోసం ఎమ్మెల్సీ వంగ మహేందర్ రెడ్డి, పెద్దలు మోహన్ రెడ్డి కూడా అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు.జిల్లా నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవ ఎన్నుకున్నారు. మిర్యాల సతీష్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా, చాగర్లముడి శ్రీధర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన జిల్లా నాయకత్వం మాట్లాడుతూతమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని, పిఆర్టియుటిఎస్ మహబూబాబాద్ జిల్లా శాఖను మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.పిఆర్టియుటిఎస్ మహబూబాబాద్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు.అలాగే ఈ ఎన్నికల కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా పిఆర్టియుటిఎస్ బాధ్యులు, ఏఎఫ్ఐటిఓ ఉపాధ్యక్షురాలు గీత, పిఆర్టియుటిఎస్ మహబూబాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు సంక బద్రినారాయణ హాజరై నూతన నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.