కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రపై మోదీ వివరణనివ్వాలి పహల్గాం’పై పార్లమెంటు సమావేశం నిర్వహించాలి ప్రజాసమస్యల సాధనకు పోరాటం జాన్వెస్లీ పిలుపు హనుమకొండ :భారత్, పాక్లకు వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు అమెరికా అధ్యక్షులు ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ వివరణనివ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణ జరగడంపై దేశప్రజలు అవమానంగా భావిస్తున్నారన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించకపోవడం సందేహాలకు తావిస్తుందన్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి విషయంలో రాజకీయాలకతీతంగా అన్నిపార్టీలు, ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి ఆపరేషన్ సింధూర్ విషయంలో మద్దతునిచ్చాయని గుర్తు చేశారు. దేశ, విదేశాల్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిపై కేంద్రం ప్రచారం చేస్తుందని, ఇదే క్రమంలో ఈ సంఘటనపై ప్రధాని పార్లమెంటు సమావేశం నిర్వహించి ఎంపీల అభిప్రాయాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయకపోవడం సందేహాలకు తావిస్తుందన్నారు. ఆకలి సూచికలో భారత్ ది 111వ స్థానం*నీతి ఆయోగ్ సమావేశంలో భారత్ 4వ అభివృద్ధి చెందిన దేశంగా ప్రధాని మోదీ చెప్పడాన్ని జాన్వెస్లీ తప్పుపట్టారు. 1శాతం ఉన్న కార్పొరేట్లు 40శాతం సంపదను కలిగి వున్నారన్నారు. 50 శాతం ఉన్న పేదలచేతిలో కేవలం 3 శాతం సంపద మాత్రమే వుందన్నారు. దేశంలో 42 శాతం మంది ప్రజలు ఉండడానికి కనీస సౌకర్యాలు లేకుండా వున్నారన్నారు. 30శాతం మంది ప్రజలకు పౌష్టికాహారం లోపముందని వివరించారు. నెలకు రూ.26 వేల కనీస వేతనమివ్వాలని కార్మికులు పోరాటం చేస్తున్నారన్నారు. లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. దేశంలో ప్రజల మధ్య సంపద సమానంగా లేదన్నారు. సమాన అభివృద్ధి జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్ కగార్ ఆపివేయాలి*ఆపరేషన్ కగార్ ను ఆపివేయాలని వామపక్షాలు, మేధావులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేసినా ఆపివేయకపోవడం దారుణమని జాన్వెస్లీ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ కగారన్ను వెంటనే ఆపివేయాలన్నారు. కాల్పుల విరమణకు సిద్ధమని, శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం పట్ల తీవ్రంగా స్పందించారు. పైపెచ్చు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ 2026 మార్చిలోపు మావోయిస్టులను లేకుండా చేస్తామని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి కేశవరావు, భూమిక తదితరులను హతమార్చి శవాలను సైతం బంధువులకు ఇవ్వకుండా కేంద్ర బలగాలు శవాల ముందు నృత్యం చేయడం, వారిని ప్రధాని మోదీ, అమిత్ అభినందించడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వాధినేతలుగా ఉండి మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించడం ఏమిటి ? అని ప్రశ్నించారు. 500 మందిని చంపేశారని, అందులో అత్యధికంగా ఆదివాసీ మహిళలే వున్నారన్నారు. ఆరుహామీలను నెరవేర్చాల్సిందే..లేదంటే గుణపాఠం తప్పదు*ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామిలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాల్సిందేనని, లేదంటే గుణపాఠం తప్పదన్నారు. ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి డబ్బులు లేవని, ఏం చేయాలని మాట్లాడడం సరైంది కాదన్నారు. గతంలో బీఆర్ఎస్ హామిలిచ్చి నెరవేర్చకుంటేనే ప్రజలు గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. ప్రజాసమస్యల సాధనకు పోరాటం ప్రజా సమస్యల సాధనకు సీపీఐ (ఎం) పోరాటం చేస్తుందని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేలా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో సీపీఐ (ఎం) నికరంగా పోరాడుతుందన్నారు.*గుడిసెల స్థానంలోనే ఇందిరమ్మ ఇండ్లు*పేదలు వేసుకున్న గుడిసెల స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మించి వారికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఇండ్లు లేని వాళ్లున్నారన్నారు. నివేశనస్థలాల కోసం గుడిసెలు వేసుకున్న పేదలను ఖాళీ చేయిస్తున్నారని, హనుమకొండ నగరంలో ఇద్దరు రాజకీయ నేతల భవంతులను ఏం చేయకుండా, పేదల గుడిసెలను మాత్రం తొలగిస్తున్నారన్నారు. నగరంలో సుందరీకరణ పేరిట వీధి వ్యాపారుల షాపులను తొలగించడం సరికాదన్నారు. వారికి వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎం. చుక్కయ్య, బొట్ల చక్రపాణి, వీరన్న, రాగుల రమేష్, గొడుగు వెంకట్, భానునాయక్, కాడబోయిన లింగయ్య, డి.తిరుపతి, జి. రాములు తదితరులు పాల్గొన్నారు.
28
May