తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రానివ్వం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

సీపీఐ మహబూబాబాద్ జిల్లా మహాసభలు ప్రారంభం

తెలంగాణలో మనువాద, ఫాసిస్ట్ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా సీపీఐ తృతీయ మహాసభలు కురవి మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన అనంతరం జరిగిన బహిరంగ సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయ సారథి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో మహాత్మాగాంధీని చంపిన గాడ్సే వారసులు బీజేపీ నాయకులని, అలాంటి పార్టీని తెలంగాణలో అధికారంలోకి రానివ్వం అన్నారు. దేశం కోసం ప్రాణాలొడ్డిన అమరుల వారసులు కమ్యూనిస్టులని చెప్పారు. కమ్యూనిస్టులను అంత చేయాలని బీజేపీ కలలు కంటున్నదని, కమ్యూనిస్టులను అంతం చేయడం బీజేపీ తరం కాదని అన్నారు. ప్రజలంతా కమ్యూనిస్టులు బ్రతకాలని కోరుకుంటుంటే మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావును అమిత్ షా అన్యాయంగా చంపించారని అన్నారు.అడాల్ఫ్ హిట్లర్ వల్లే కమ్యూనిస్టులను అంతం చేయడం సాధ్యం కాలేదని, అప్ట్రాల్ అమిత్ షా నువ్వు కమ్యూనిజాన్ని లేకుండా చేయగలవా..? అని ప్రశ్నించారు. దేశంలో వామపక్షాలకు సిపిఐ పెద్దన్న పాత్ర పోషిస్తుందని, 1951 వరకు తాము సాయుధపోరాటం చేసామని, పరిస్థితులను బట్టి ఆయుధాలను జమ్మిచెట్టు మీద పెట్టామని, వాటిని తిరిగి తీసే అవసరం రాకూడదనే కోరుకుంటున్నామన్నారు. మావోయిస్టులు కూడా ఆ..దిశగా ఆలోచన చేయాలని కోరుతున్నామని, మావోయిస్టులు కూడా తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు అంటే మనవాడేనని, సిపిఎం, సిపిఐ(యంయల్) మనవాడేనని, ఎర్రజెండా పట్టుకున్న ప్రతివాడు మనవాడేనని చెప్పారు.కమ్యూనిస్ట్ లను పురిటిలోనే చంపాలని చూసిన కంసుని లాంటి బూర్జువాలు, పెత్తందార్లు, కార్పోరేట్ శక్తులు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. కమ్యూనిజం సజీవం.. శాశ్వతం.. అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా కమ్యూనిస్టులు ప్రజలకోసం పోరాడుతారని, తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని,పాలకులను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. పదవులు తమకు ముఖ్యం కాదని, మమ్మల్ని, ప్రజల్ని కాదనుకొని బిఆర్ఎస్ ఫాంహౌస్ కు పోయిందని, ప్రజలకు నష్టం చేస్తే రేపు కాంగ్రెస్ గతైనా అంతేనని స్పష్టం చేశారు. దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా గ్రామ గ్రామాన ఆవిర్భావ ఉత్సవాలు జరుపుతున్నామని, ఖమ్మం లో డిసెంబర్-26న వంద సంవత్సరాల వేడుకను లక్షలాదిమందితో నిర్వహించబోతున్నామని తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది మనిషి కోసమేనని, మనుషులు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందని చెప్పారు.

జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పోరాటాలకు సిద్ధం కండి

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కురవిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలం అయిందని చెప్పారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ రాలేదని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసిన యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కురవిలో భారీ ర్యాలీ, బహిరంగ సభ
సీపీఐ మహబూబాబాద్ జిల్లా తృతీయ మహాసభల సందర్భంగా కురవిలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఓం ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ర్యాలీలో ఎర్ర చొక్కాలతో యువకులు, ఎర్ర చీరలతో మహిళలు కదం తొక్కారు. ఈ ర్యాలీ, బహిరంగ సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయ సారథి, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు తమెర విశ్వేశ్వర్ రావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బి అజయ్,రాష్ట్ర సమితి సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి,నాయకులు పెరుగు కుమార్, మామిండ్ల సాంబలక్ష్మి, చింతకుంట్ల వెంకన్న, రేశపల్లి నవీన్, కనకం రాజన్న, నెల్లూరి నాగేశ్వర్ రావు, పాండురంగ చారి, వరిపల్లి వెంకన్న,జంపాల వెంకన్న,చొప్పరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *