శనివారం మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామంలో జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ మరియు ఉద్యాన పంటల అవగాహన కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు డా. భూక్య మురళి నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్ సాగు చేసి ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం పొందాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు.
మహబూబాబాద్ జిల్లాలో 8000 ఎకరాల పైగా పామాయిల్ సాగు అవుతుంది, 1350 ఎకరాలలో పామాయిల్ గెలలు దిగుబడి మొదలై ప్రతి రైతు ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు. ఈ సంవత్సరానికి గాను 4500 ఎకరాల లక్ష్యంతో ఇప్పటి వరకు 663 ఎకరాలలో మొక్కలు నాటడానికి రైతులు అనుమతి పొందారన్నారు.
జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జి.మరియన్న మాట్లాడుతూ ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి అవసరాల నిమిత్తం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవాలి. కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రోట్రేస్లలో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలన్నారు.