ఫ్రతీ విద్యార్థి తమ జీవిత గమ్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బి. వీరన్న, క్లబ్ డిస్ట్రిక్ట్ గెస్ట్ డాక్టర్ ఎర్రంరెడ్డి రంగారెడ్డి సూచించారు. మంగళవారం మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలికలకు క్లబ్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. లక్ష్మణ్ రావు అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ వీరన్న, డాక్టర్ రంగారెడ్డి మాట్లాడారు. మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన విద్యార్థినులు చదువుకునే సమయంలో కేవలం తమ చదువుపైన దృష్టి సారించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఉన్నత ఆశయాలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పారు. ఈ ప్రాంతాలకు చెంది ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకొని మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పరకాల రవీందర్ రెడ్డి, కోశాధికారి కొండపల్లి కరుణాకర్ రెడ్డి, సీనియర్ బాధ్యులు బవిరిశెట్టి నాగేశ్వర రావు, పమ్మి సనాతన చారి, సాదుల సురేష్ బాబు, పారుపల్లి రమేశ్ బాబు, ఉపాధ్యాయులు యుద్దనపూడి గాయత్రి, ఎం.వి. లావణ్య, జీ.వీ. రమణమ్మ, బి. పల్లవి, ఎం. సునీత, డోలి అరుణ, ఆర్. శ్రీలత, టీ. వనజ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యం ఎంచుకుని ముందడుగు వేయాలి : లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బి. వీరన్న
26
Aug