అవకతవకలు లేకుంటే నర్సరీ గేటుకు తాళాలు ఎందుకు వేశారు..?

మహా తెలంగాణ/తొర్రూరు :

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల సమీపంలోని ఆయిల్ ఫామ్ నర్సరీలో జరుగుతున్న అవకతవకలను బీఆర్ఎస్ నాయకులు ఇటీవల వెలుగులోకి తీసుకురావడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బుధవారం నర్సరీని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమని ప్రకటించిన నేపథ్యంలో, వాటిని ఆధారాలతో నిరూపించేందుకు గురువారం మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మరోసారి నర్సరీకి వెళ్లారు. అయితే నర్సరీ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులను సిబ్బంది లోపలికి అనుమతించకుండా గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. అధికారుల అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించబోమని సిబ్బంది చెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు గేటు ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు. నర్సరీలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలకు సంబంధించిన ఫోటోలను ప్రదర్శిస్తూ అధికారులను నిలదీశారు. నినాదాలు చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, తాము మంగళవారం నర్సరీలో జరుగుతున్న అవకతవకలను మాత్రమే ప్రశ్నించామని, కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే లేదా ఇతర ప్రజాప్రతినిధుల పేర్లను ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. అయితే కాంగ్రెస్ నాయకులు రాజకీయ కోణంలో స్పందిస్తూ బీఆర్ఎస్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతులకు నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలు అందించాల్సిన నర్సరీల్లో నాసిరకం విత్తనాలు, నాసిరకం వర్మీ కంపోస్ట్, నాసిరకం మట్టి, నాసిరకం ఎరువులు వినియోగించడం వల్ల వేలాది మొక్కలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. 2026 జనవరిలో నాటిన 60 వేల స్ప్రింగ్ వెరైటీ విత్తనాల్లో కేవలం 30 వేల విత్తనాలు మాత్రమే మొలకెత్తడం ఆందోళనకర విషయమన్నారు. నర్సరీలో మూడు షెడ్లు ఉండగా 24 మంది కూలీలు పనిచేయాల్సి ఉండగా కేవలం 11 మందితోనే పనులు నిర్వహిస్తున్నారని, దీని వల్ల మొక్కల సంరక్షణ సక్రమంగా జరగడం లేదన్నారు. గ్రేడ్-1 మొక్కలను నాలుగు నెలల తర్వాత బయటకు తీసి పెంచాల్సి ఉండగా ఏడు నెలలు గడిచినా తరలించకపోవడం వల్ల మొక్కలు బలహీనపడుతున్నాయని తెలిపారు. నీటి కొరత, ఎరువుల నిర్వహణలో లోపాలు, నాసిరకం సామగ్రి వినియోగం కారణంగా దాదాపు 40 శాతం మొక్కలు నష్టపోయినట్లు తమ పరిశీలనలో గుర్తించామని పేర్కొన్నారు. నర్సరీలో పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు చెల్లించడం లేదని, ఒక్కో కూలీకి సుమారు రూ.1.50 లక్షల వరకు బకాయిలు ఉన్నాయని ఆరోపించారు. రైతుల పక్షాన నిలవాల్సిన కాంగ్రెస్ నాయకులు ఈ అంశాలపై స్పందించకుండా అధికారులకు వత్తాసు పలకడం బాధాకరమన్నారు.అవకతవకలు లేవని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్లయితే బీఆర్ఎస్ నాయకులను నర్సరీలోకి ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. గేటుకు తాళం వేయడమే అక్కడ ఏదో దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలకు బలం చేకూరుస్తోందన్నారు. జిల్లా కలెక్టర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హరిపిరాల, గోపాలగిరి ఆయిల్ ఫామ్ నర్సరీలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంగళపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రైతులకు నాణ్యమైన మొక్కలు అందించి ఆయిల్ ఫామ్ సాగుపై విశ్వాసం పెంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టౌన్ పార్టీ అధ్యక్షులు బిందు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, పట్టణ కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు అంకూస్, మండల నాయకుడు కాలునాయక్, హరిపిరాల సర్పంచ్ స్వాతి రాజు, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ విజయ్ కుమార్ , రాజబాబు , జటోత్ బాలు నాయక్, అనంతరెడ్డి ఎండి అబ్బాసు మురళీకృష్ణారెడ్డి శోభన్ లింగేష్ యాదవ్ రాంబాబు రమేష్ నాయక్ రాజు, ఆయిల్ ఫామ్ రైతులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *