మహా తెలంగాణ/మహబూబాబాద్ :
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున కొత్తగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణ్యాతండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఉదయం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 ఇళ్లను, పరిసర ప్రాంతాలను పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 21 వాహనాలను గుర్తించారు. అదేవిధంగా అక్రమంగా నిల్వ ఉంచిన 32 లీటర్ల గుడుంబా, 120 కిలోల బెల్లం (బ్లాక్ జాగరీ) స్వాధీనం చేసుకుని, గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 800 లీటర్ల బెల్లం ఊటను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించి నిందితులపై చట్టపరమైన కేసులు నమోదు చేయనున్నట్లు గూడూరు సీఐ వినయ్ తెలిపారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, సైబర్ నేరాల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులు లేదా సైబర్ మోసాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో సర్కిల్ ఫోర్స్, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్‌కు చెందిన మొత్తం 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.