మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ జిల్లా నర్సంపేట లో బిఆర్ఎస్ ధర్నా
మహా తెలంగాణ/నర్సంపేట :
ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రజలు ప్రేమతో ప్రైవేట్ స్థలంలో మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది కూల్చివేయడం అత్యంత దారుణ విషయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం నర్సంపేట పట్టణంలో దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూల్చివేసిన ప్రాంతాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు,వినోద్ కుమార్ సందర్శించారు. స్థానిక పాటికి నర్సంపేట పట్టణ జంక్షన్ లో రోడ్డుపై ధర్నాను నిర్వహించారు.ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించిన నేపథ్యంలో ఆ గౌరవాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ స్థలంలో ఏర్పాటుచేసిన విగ్రహాన్ని కూల్చి వేయడం ద్వారా ప్రభుత్వం తన విష పూరిత కుట్రను బయట పెట్టుకుందని అన్నారు. అదే స్థలంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పెట్టాలని, లేకుంటే చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళ్తామని వినోద్ కుమార్ ప్రభుత్వానికి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.