భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను వేగవంతం చేయాలి

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచాలి

మందకొడి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెవెన్యూ, రీ-సర్వే, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై మహాబూబాబాద్ ఐడిఓసి కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఉమ్మడి వరంగల్ జిల్లాప్రజా ప్రతినిధులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణ శాఖల కార్యదర్శులతో సమీక్ష…

మహాతెలంగాణ చీఫ్ బ్యూరో/మహబూబాబాద్:

రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ప్రతి భూయజమానికి చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి* అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కతో కలిసి సోమవారం మహబూబాబాద్ ఐడీఓసీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని రెవెన్యూ, భూ రీ-సర్వే, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల్లో భూ రీ-సర్వే పురోగతి, నాన్-కెడస్ట్రల్ మరియు కెడస్ట్రల్ గ్రామాల్లో సర్వే పనులు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల పనితీరు, 22-ఏ భూముల వివరాలు, సాదా బైనామాలు, అటవీ–రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలు, ధరణి స్థానంలో అమలులోకి వచ్చిన భూభారతి చట్టం, రిజిస్ట్రేషన్ శాఖ నూతన కార్యాలయాల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, రెండో విడత ఇళ్ల మంజూరు, ఉచిత ఇసుక సరఫరా తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.*భూ రీ-సర్వేను వేగవంతం చేయాలి*రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వే ప్రక్రియను ప్రాధాన్యతా అంశంగా తీసుకొని వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను లక్ష్యంగా ఎంపిక చేసి మొదటి విడత భూ సర్వేను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రెండో విడత సర్వేను వచ్చే ఏడాది మార్చి నాటికి చేపట్టి, రాబోయే ఏడాదిన్నరలో రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని వ్యవసాయ, వ్యవసాయేతర, ఆబాదీ ఆస్తుల వారీగా శాస్త్రీయంగా సర్వే చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 31 నాన్-కెడస్ట్రల్ గ్రామాలకు గాను 18 గ్రామాల్లో రీ-సర్వే పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో ఐదు గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మరో 13 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన 13 గ్రామాల్లో, భూపాలపల్లి జిల్లాలో 8, జనగామ జిల్లాలో 5 గ్రామాల్లో సర్వే పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.అదేవిధంగా నక్షా ఉన్న 70 కెడస్ట్రల్ గ్రామాలను నోటిఫై చేయగా, 40 గ్రామాల్లో సర్వే పనులు కొనసాగుతున్నాయని, ఏడు గ్రామాల్లో సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు. ఆరు జిల్లాల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 12 గ్రామాల్లో రీ-సర్వే పూర్తికాగా, 53 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ-సర్వేలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు తప్పనిసరిగా పాల్గొనాలని మంత్రి స్పష్టం చేశారు. రీ-సర్వే విధులకు హాజరుకాకుండా ప్రైవేట్ సర్వేలకు మాత్రమే పరిమితమయ్యే సర్వేయర్లకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.క్షేత్రస్థాయికి వెళ్లకుండా సర్టిఫికెట్లు జారీ చేయడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.భూ సర్వే పనులకు అవసరమైన శిక్షణ పొందిన సిబ్బందిని తగిన సంఖ్యలో సిద్ధం చేయాలని, ప్రత్యామ్నాయ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఆదేశించారు. సర్వే పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్వేను వేగవంతం చేసేందుకు మొత్తం 66 రోవర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు.*22-ఏ భూములపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక*ప్రతి జిల్లాలో 22-ఏ కింద ఉన్న భూములు ఏవి, వాటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఎంత, ఇతర వివరాలు ఏమిటి అనే అంశాలను నాలుగు కాలమ్స్‌తో కూడిన సమగ్ర నివేదికగా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. సర్వే నంబర్ల వారీగా పూర్తి వివరాలను 24 గంటలు నిరంతరం శ్రమించి రెండు రోజుల్లో అధికారులకు సమర్పించాలని స్పష్టం చేశారు.22-ఏ జాబితాలో పొరపాటున చేరిన రైతుల భూముల వివరాలను పరిశీలించి, అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.ధరణి స్థానంలో ప్రభుత్వం నూతన భూ భారతి వ్యవసాయ, రెవెన్యూ చట్టాలను తీసుకువచ్చి, అధికారాలను వికేంద్రీకరించి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించిందని మంత్రి తెలిపారు.ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా, పారదర్శకంగా రెవెన్యూ సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సాదా బైనామాలు తదితర సమస్యలను సమగ్రంగా పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి రైతుకు చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా సమావేశమై, శాస్త్రీయ పద్ధతుల్లో భూముల కొలతలు చేపట్టి సరిహద్దులను నిర్ధారించాలని సూచించారు.గతంలో పోడు భూములకు పట్టాలు పొందిన రైతులు బోర్లు, విద్యుత్ కనెక్షన్లు తదితర సౌకర్యాలు పొందే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.*రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల నిర్మాణాలు వేగవంతం చేయాలి*రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ పురోగతిపై కూడా మంత్రి సమీక్షించారు. జూలై 7న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నర్సంపేట, పరకాల, ములుగు, జనగామ, భూపాలపల్లి ప్రాంతాల్లో ఐదు సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయాలు, వరంగల్‌లో ఒక డీఐజీ కార్యాలయం మంజూరైనట్లు అధికారులు తెలిపారు.హనుమకొండ జిల్లా పల్లివేల్పులలో డీఐజీ కార్యాలయం కోసం 20 గుంటలు/ఒక ఎకరం ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్థలాన్ని కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనిమిది కార్యాలయాలు ప్రస్తుతం ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. పరకాలలో నూతన భవన నిర్మాణం 70 శాతం పూర్తయిందని తెలిపారు. భీమదేవరపల్లి, పరకాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు హౌసింగ్ శాఖకు అప్పగించాలని నిర్ణయించారు.*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి*ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, రెండో విడత ఇళ్ల మంజూరు, ఉచిత ఇసుక సరఫరా, లబ్ధిదారుల ఎంపికపై మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.1,200 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మాణాలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.భూపాలపల్లి జిల్లాలో 4,600 ఇళ్లు మంజూరు కాగా, 3,946 ఇళ్లకు ప్రాసెస్ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు 854 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ములుగు జిల్లాలో కూడా ఇళ్ల పూర్తిశాతం 50 శాతానికి లోపే ఉందని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి సెప్టెంబర్ 15 నాటికి గరిష్ఠ సంఖ్యలో ఇళ్లను పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు.*గుడిసెల రహిత తెలంగాణే లక్ష్యం*రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.అదేవిధంగా రేకులు లేదా ఇతర తాత్కాలిక పైకప్పులతో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకం కింద పాత పైకప్పును తొలగించి ఆర్‌సీసీ స్లాబ్ నిర్మించుకునేందుకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.*ఉచిత ఇసుక సరఫరాలో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట*ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక అందించేందుకు “మన ఇసుక వాహనం” పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ, కొంతమంది ప్రైవేట్ ట్రాక్టర్ కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు అదనపు రవాణా చార్జీల పేరుతో లబ్ధిదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నట్లు సమీక్షలో వెల్లడైంది.ఐదు కిలోమీటర్ల పరిధిలోని ఇసుక క్వారీల నుంచి ఒక ట్రాక్టర్ ఇసుకకు రూ.5,000 వరకు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులపై అదనపు భారం పడకుండా ఉచిత ఇసుక సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు.రవాణా రేట్లను శాస్త్రీయంగా నిర్ణయించి, వాటిని సిస్టమ్‌లో ఆన్‌బోర్డ్ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.*ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు*ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, మంజూరు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఇళ్ల మంజూరులో లబ్ధిదారుల నుండి డబ్బులు తీసుకుంటే సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.*రైతులు, పేదలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలి*ప్రజలకు చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తూ, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం, పేదలకు సొంతింటి కలను సాకారం చేయడం ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.భూ సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు పోరిక బలరామ్ నాయక్, డాక్టర్ కడియం కావ్య, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రు నాయక్, శాసనమండలి సభ్యులు బసవరాజు సారయ్య, శాసనసభ్యులు మురళీ నాయక్, కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు జ్యోతి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణ శాఖల కార్యదర్శులు లోకేష్ కుమార్, రాజీవ్ గాంధీ హనుమంతు, వి.పి. గౌతమ్, జిల్లా కలెక్టర్లు స్నేహా శబరీష్, చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, సందీప్ కుమార్ ఝా, హేమంత్ బొర్కడే సహదేవరావు, రాహుల్ శర్మ, అటవీ శాఖ అధికారులు పి. లావణ్య, జి. ముకుందరెడ్డి, బి. నికిత, వికాస్ మీనా, జి. కిష్టాగౌడ్, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *