గంజాయి తాగేవారిలో మార్పు తీసుకొస్తున్న మహబూబాబాద్ జిల్లా పోలీసులు..
మహబూబాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం – ఎస్పీ డాక్టర్ శబరీష్
మహబూబాబాద్ :
మహబూబాబాద్ జిల్లాలో గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలను పూర్తిగా నిర్మూలించి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని జిల్లా పోలీసు అధికారి డాక్టర్ శబరీష్, ఐపీఎస్ తెలిపారు.గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు మరియు వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం నిఘా నిర్వహిస్తున్నాయని తెలిపారు. డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది రాత్రి వేళల్లో విస్తృతంగా గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద ప్రాంతాలు, నిర్జన ప్రదేశాలు, యువత ఎక్కువగా గుమికూడే ప్రాంతాలు, గంజాయి వినియోగానికి అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.గంజాయి గుర్తింపునకు ఉపయోగపడే అత్యాధునిక 4000 గంజాయి టెస్టింగ్ కిట్లు ప్రస్తుతం జిల్లా పోలీసు శాఖకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఈ కిట్లను విధుల్లో భాగంగా వెంట తీసుకెళ్తూ అనుమానిత వ్యక్తులు లేదా పదార్థాలను అక్కడికక్కడే పరీక్షించి కేవలం 10 నిమిషాల్లో ఫలితాలు పొందగలరని చెప్పారు. దీంతో గంజాయి సేవిస్తున్న వారిని, గంజాయి కలిగి ఉన్న వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం మరింత సులభమవుతుందని తెలిపారు.గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులు తిరిగి సాధారణ జీవితంలోకి రావడానికి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డీ-అడిక్షన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మత్తు పదార్థాల అలవాటు నుండి బయటపడాలనుకునే వారు లేదా వారి కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదిస్తే కౌన్సెలింగ్, వైద్య సహాయం మరియు సంబంధిత డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా పునరావాస సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువతను వ్యసనాల బారినుంచి రక్షించడం కూడా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని అన్నారు.గంజాయి సేవించడం, నిల్వ ఉంచడం, విక్రయించడం లేదా రవాణా చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయం, వినియోగం లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 8712656999 నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రజలు, మీడియా ప్రతినిధులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించి మహబూబాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములు కావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.గంజాయి నిర్మూలన కోసం జిల్లా పోలీసు శాఖ నిరంతరం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, ఐపీఎస్ స్పష్టం చేశారు.