నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలి.
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా,
మహా తెలంగాణ/ మహబూబాబాద్ :
సాగు భూమి కలిగిన ప్రతి రైతుకు యూరియా సరఫరా చేయాలి అని, పెండింగ్ లో ఉన్న రైతు భరోసా నిధులు విడుదల చేయాలి అని, నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేయాలి అని, కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుణగంటి రాజన్న మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమైందని రైతులకు కల్తీ విత్తనాలు, పురుగుమందులు అందకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు అవకాశం ఉంటుంది అని , కల్తీ,నాసిరకం విత్తనాలు పంపిణీ చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంట కాలువలు మరమ్మతులు లేక చివరి భూములకు సాగునీరు ప్రవహించే అవకాశం లేకుండా పోయింది అని పంట కాలువలు మరమ్మతులు చేయాలి అని అన్నారు. రబి సీజన్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న రైతులకు పెండింగ్ డబ్బులను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం కరువు పరిస్థితులు రాబోతున్నట్టు తెలుస్తుందని అందుకోసం ప్రభుత్వం తక్షణ స్పందించి యాక్షన్ ప్లాన్ రూపొందించి రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నల్లపు సుధాకర్, ఆకుల రాజు, భానోత్ వెంకన్న, మాలోత్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.