విద్యార్థుల గొంతు నొక్కే పోలీసులు..!!

‘ప్రపంచ మానవత్వ దినోత్సవం’ నాడు విద్యార్థులపై మానవత్వం లేకుండా ప్రవర్తించిన పోలీసుల తీరు

ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ ఎటు పోతోంది?

జీవో నం.97 రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్‌

కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన పాలిటెక్నిక్‌ విద్యార్థులు

విద్యార్థులపై మహబూబాబాద్ పోలీసుల కఠిన వైఖరి

మహాతెలంగాణ/మహబూబాబాద్:

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించిన పాలిటెక్నిక్‌ విద్యార్థుల పట్ల పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ విద్యా రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, జీవో నం.97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేసముద్రం పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా విద్యార్థుల ఆందోళనను అదుపు చేసే క్రమంలో కొంతమంది పోలీసులు వ్యవహరించిన తీరు విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను, సామాజిక వేత్తలను, రాజకీయ నాయకులను విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా విద్యార్థుల గొంతు పట్టుకొని పోలీసులు వ్యవహరించిన దృశ్యాలు విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పే పోలీసులు ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగే విద్యార్థులపై కఠినంగా వ్యవహరించి ‘ప్రపంచ మానవత్వ దినోత్సవం’ నాడు మానవ విద్యార్థులపై మానవత్వం లేకుండా ప్రవర్తించిన పోలీసుల తీరుపై పోలీసు వ్యవస్థ గురించి సమాజానికి వారు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి.

సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపిన విద్యార్థులతో పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. విద్యార్థుల అభ్యంతరాలను వినడం, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కార మార్గాన్ని అన్వేషించాల్సిన పోలీసులు, బలప్రయోగానికి దిగడం సరైన పద్ధతి కాదని విద్యార్థి సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థుల ఆందోళనకు దారితీసిన కారణాలపై ప్రభుత్వం స్పందించి, జీవో నం.97పై స్పష్టత ఇవ్వడంతో పాటు పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అదే సమయంలో ఆందోళన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

విద్యార్థుల గొంతును అణచివేయడం కాదు.. వారి సమస్యలను వినడం, పరిష్కరించడమే ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనం అన్న అభిప్రాయాలు ఈ ఘటన నేపథ్యంలో వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన కఠిన వైఖరి పట్ల, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శనాస్త్రాలు వెల్లువిరుస్తున్నాయి. విద్యార్థుల గొంతు నొక్కిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *