- రెండేళ్లలో రూ.17కోట్ల పీఆర్ నిధులు
- ఎస్డీఎఫ్ నుంచి మరో రూ.2కోట్లు
- తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి
- బ్లీచింగ్, ఫాగింగ్ తప్పనిసరి
- రైతులకు విద్యుత్, వ్యవసాయఅధికారులు అందుబాటులో ఉండాలి
- ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్
మహా తెలంగాణ/మరిపెడ
ఆరోగ్య గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబల కుండా పారిశుధ్యం, ఫాగింగ్, బ్లీచింగ్ చేయాలని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. శుక్రవారం మరిపెడ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్యసమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు గత ఏడాది కాలముగా నిర్వహించిన పనులు, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజా ప్రతినిధుల సమక్షంలో చదివి వినిపించారు. పలువురు సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించవల్సిందిగా అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గడచిన రెండున్నరేళ్లలో గ్రామాల అభివృద్దికి రూ.17కోట్లు పంచాయతీరాజ్ నుంచి, తన సొంత నిధులు ఎస్డీఎఫ్ నుంచి రూ.2కోట్లు, మంజూరు చేయించి గ్రామాల్లో జీపీ భవనాలు, వీవో భవనాలు, సీసీలు, డ్రైనేజీలు నిర్మించటం జరిగిందన్నారు. అదే విధంగా స్పెషల్ ఫండ్స్ రూ.4కోట్లతో లైట్లు, గ్రామాల్లో నెలకొని ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించామన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా వెను వెంటనే పరిష్కరింస్తున్నామన్నారు. ఎల్నీనో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారులు, విద్యుత్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, ఏ సమయంలో సమస్య అన్న స్పందించి వెంటనే పని చేయాలన్నారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ నుంచి మంజూరైన రోడ్ల పనులను, భవనాల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా మరిపెడ గ్రామంలో మునిసిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మెన్ కాలం సునీతా రవీందర్, పట్టణ అధ్యక్షుడు బానోతు రాంలాల్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీమన్నారయణ, తహసీల్దార్ కృష్ణవేణి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ పెదబోయిన అయిమల్లు, అన్ని శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.