కలెక్టర్ ఆదేశాలతో ఇసుక ప్రాంతాల ఆకస్మిక తనిఖీలు మహాతెలంగాణ/నర్సింహులపేట. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సింహులపేట మండలంలోని ఇసుక ప్రాంతాల్లో అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తొర్రూర్ ఆర్డీఓ గణేష్ , మహబూబాబాద్ గనులు మరియు భూగర్భ శాఖ సహాయ సంచాలకులు వెంకటరమణ , తొర్రూర్ సీఐ గణేష్ , తహసీల్దార్ రమేష్ బాబు , ఎస్ఐ వెంకన్న మరియు సంబంధిత శాఖల సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. మండలంలోని ఇసుక నిల్వ ప్రాంతాలు, రవాణా మార్గాలు, అనుమతులతో జరుగుతున్న తవ్వకాలు, నిల్వల పరిస్థితిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు, అక్రమ నిల్వలు, అనుమతి లేని రవాణా జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక రవాణాకు సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు.అక్రమ ఇసుక రవాణాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
20
Jun